పథకాల కోసం అర్హులైన వారెవ్వరూ రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ లో మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు వంటి సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకాల కోసం కొత్త దరఖాస్తులు ఎన్ని వచ్చినా తీసుకుంటామని స్పష్టం చేశారు. అనర్హులకు లబ్ధి చేకూరినట్టు తేలితే వారికి మధ్యలోనే పథకాలను ఆపేస్తామన్నారు.
త్వరలో ఇంటింటికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని.. నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజల ఆంకాంక్షలు నెరవేర్చడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అందని రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను తమ ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు.