సీఎం కేసీఆర్ హయాంలో పాలమూరుకు తీరని అన్యాయం జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయభేరీ సభకు హాజరై రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ పాలనలో పాలమూరు ప్రజలపై రౌడీ మూకలు దాడులు పెరిగాయన్నారు. దాడులను తిప్పికొడతాం. దాడులు చేసేవారిని తరిమికొడుతామన్నారు. పాలమూరు నుంచి వలసలు ఇప్పటికే ఆగలేదని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం ఎందుకు అని.. బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఉండాలా.. దొరల రాజ్యం ఉండాలా.. రాష్ట్రంలో గడీల ప్రభుత్వం ఉండాలో పేదల ప్రభుత్వం ఉండాలో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
దొరల రాజ్యం కోసమే విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారా అని ఫైర్ అయ్యారు. దొరల రాజ్యంలో 1800 బార్లు, 3వేల వైన్ షాపులు, 60వేల బెల్టు షాపులు వచ్చాయని విమర్శలు గుప్పించారు. పాలమూరులో వలసలు, ఆత్మహత్యలు ఆగలేదన్నారు. ఓట్లు కొనుగోలు చేసి మరోసారి అందలం ఎక్కాలని బీఆర్ఎస్ నేతలు కలలు కంటున్నారని అన్నారు.