తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. పదేళ్లు కేసిఆర్ కు అవకాశం ఇస్తే ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. భారాసకు మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణ పరిస్థితిని ఊహించలేమన్నారు. వనపర్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇకపై అభివృద్ధి కోసం ఎవరి దగ్గర చేతులు చాచాల్సిన అవసరం లేదు. మన అభివృద్ధి, మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. వనపర్తికి పరిశ్రమలు రావాలంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవాలి.
పాలమూరు జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా తీసుకునేల ప్రజల నిర్ణయం ఉండాలి. తెలంగాణ వస్తే రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఉండవు అనుకున్నాం. సింగరేణి, విద్యుత్ కార్మికులు తమ బతుకులు బాగుపడతాయని అనుకున్నారు. దళితులు, గిరిజనులు ఆత్మగౌరవంతో బతకాలనుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజల ఆంక్షలు నెరవేరలేదు. కేసీఆర్ కుటుంబం, భారాస నేతల కళలు మాత్రమే నెరవేరాయి. తెలంగాణ తీసుకొచ్చామని చెప్పిన వారికి పదేళ్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాదా? ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎంతో నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.