వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణ గడ్డపై జెండా ఎగురవేయాలని కమలదళం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే.. రాష్ట్రంలో ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలను కలిసేలా కార్యాచరణను రూపొందించింది. ఈనెల 22న ‘ఇంటింటికీ బీజేపీ’ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న వేళ.. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. పోలింగ్ కేంద్రం ఇంఛార్జ్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరకూ…. ప్రతి ఒక్కరు… ఆ రోజున తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలను కలవనున్నారు.
ఈనెల 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘ఇంటింటికి బీజేపీ’ పేరిట ప్రజలతో మమేకం కానున్నారు. ప్రధాని మోదీ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించనున్నారు. ఈ మేరకు ప్రచురించిన కరపత్రాలను ఇంటింటికీ పంచనున్నారు. స్టిక్కర్లను అంటించనున్నారు. బండి సంజయ్… ఆ రోజు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చైతన్యపురి, విద్యానగర్ కాలనీల్లో పర్యటిస్తారు. స్వయంగా ఇంటింటికీ వెళ్లి మోదీ ప్రభుత్వ విజయాలు వివరిస్తారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహా ముఖ్యనేతలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో పర్యటిస్తారు.