తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర, జనసంపర్ యాత్రల పేరిట ప్రజల్లోకి వెళ్లింది. ఇప్పుడు ఇంటింటికీ బీజేపీ పేరుతో ఇవాళ కాషాయదళం ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ ఒక్క రోజే 35 లక్షల కుటుంబాలను కలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. పోలింగ్ బూత్ అధ్యక్షుడి మొదలు… రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఒక్కొక్కరూ కనీసం వంద కుటుంబాలను కలిసేలా కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రస్థాయి నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో ప్రజల వద్దకు వెళ్లి నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు కరపత్రాలను పంపిణి చేయనున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చైతన్యపురి, విద్యానగర్ కాలనీల్లో పర్యటించనున్నారు. ఇంటింటికీ వెళ్లి మోదీ ప్రభుత్వ విజయాలు, ప్రజలకు జరిగిన మేలును వివరించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్‌పేట, నాంపల్లి, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్లనున్నారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజం వస్తుందని నాయకత్వం భావిస్తోంది.