నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని సోమాజిగూడ లో రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు టీపిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, సీనియర్ నేత వి హనుమంతరావు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తదితరులు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలను బలోపేతం చేసింది రాజీవ్ గాంధీనే అని తెలిపారు. దేశంలో విభజించు పాలించు అనే విధానాన్ని బిజెపి అవలంబిస్తుందని.. మణిపూర్ మండుతున్నా అక్కడి ప్రజలకు ప్రధాని భరోసా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. ఏదైనా ఉంటే ఎన్నిక సమయానికి అందరం ఒకటవుతామన్నారు. హైకమాండ్ అన్ని సమస్యలు పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరం కలిసి కృషి చేస్తామన్నారు. జగ్గారెడ్డి పార్టీలోనే ఉంటారని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడేది లేదని క్లారిటీ ఇచ్చారని వివరించారు.