47 రోజులపాటు జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథఅయంలో రైల్వే అధికారుల నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ఏడాదిగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో భద్రతా పరమైన ఆధునికీకరణ పనులు జరుగుతుండటంతో సింహాద్రి, ఉదయ్, రాయగడ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు.
విశాఖ నుంచి అన్నవరం, రాజమహేంద్రవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయవాడ వెళ్లే ప్రయాణికుల్లో అధిక శాతం జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను ఎక్కుతారు. రోజుకు 20వేల మంది ఆయా రైళ్లపై ఆధాపడుతున్నారు. అంతటి కీలకమైన రైళ్లను ఈనెల 24వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు అంటే 47రోజులపాటు రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం మూడింటిలో ఒక్క రైలైనా నడపాలని పలువురు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే వేలాది మంది తీవ్ర ఇబ్బందులు పడతారని వాపోతున్నారు. కీలకమైన రైళ్లను రద్దు చేయాలని రైల్వే నిర్ణయం తీసుకోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే వాల్తేరు డివిజన్ అధికారులకు నిరసన సెగ మొదలైంది.