నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఇక నుంచి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించింది. ఆ దిశగా ఏటా నోటిఫికేషన్‌లతో కూడిన ఉద్యోగ క్యాలెండర్ వెలువరించేందుకు చర్యలు చేపడుతోంది. ప్రధానంగా ఈ ఏడాదికి సంబంధించి రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిర్ణయించింది. టీజీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్-1, 2, 3, 4 ఉద్యోగాలతో పాటు గురుకులాలు, పోలీసు, వైద్య నియామక బోర్డుల నోటిఫికేషన్లు, ఇతర విభాగాల పోస్టులన్నింటినికి సంబంధించి జాబ్ క్యాలెండ్ రిలీజ్ చేయనుంది. ఉద్యోగ క్యాలెండర్ విడుదలపై నిర్ణయం తీసుకొన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ప్రకటనలు వెలువరించేందుకు ప్రభుత్వ విభాగాలు ఎప్పటికప్పుడు ఖాళీల్ని గుర్తించాలని టీజీపీఎస్సీ అన్ని విభాగాలకు లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో రానున్న మూడేళ్లలో పదవీ విరమణ చేయనున్న వారితో ఏర్పడే ఖాళీలను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. అసలు ఖాళీల సంఖ్యతో ప్రమేయం లేకుండా ఏటా గ్రూప్-1, 2, 3, 4 సర్వీసు ఉద్యోగాల నోటిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఉద్యోగార్థులు, నిరుద్యోగులు తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు ఉపయోగపడేలా క్యాలెండర్ ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.