భూ నిర్వాసితులు గొప్ప త్యాగ ధనులు అని.. వారికి భూ సేకరణ పరిహారం చెల్లించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్ 2 ఆయిల్ సింక్రనైజేషన్ పనులు డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి పవర్ ప్లాంట్ రాష్ట్ర ప్రజల సంపద అని.. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచడానికి విద్యుత్ అవసరాలు తీర్చడానికి ఓ ఉన్నత కార్యక్రమం అన్నారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ పనులకు 2015 ఫిబ్రవరిలోనే పునాదులు పడితే..అదే ఏడాది అక్టోబర్ లో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. 2020 అక్టోబర్ 2 యూనిట్ లు, 2021 నాటికి మిగిలిన మూడు యూనిట్లు పూర్తి చేయాలని గత ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అనుకున్న సమయానికి అందించకపోవడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం పడిందన్నారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి పవర్ ప్రాజెక్ట్ కి అనుమతులు నిరాకరించబడ్డాయని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.