రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పదవులను ఊడగొడితే ఆత్మహత్య చేసుకుంటానని.. లేకపోతే మీరు ఆత్మహత్య చేసుకుంటారా? అని ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. హైదరాబాద్లో జిల్లా నుంచి కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరే కార్యక్రమంలో తనను అవమానించేలా మాట్లాడటంపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. శుక్రవారం రోజున జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యర్థిని అయిన తనను అవమానించేలా మాట్లాడటం ఒక పార్టీ అధ్యక్షుడిగా తగదన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో పట్టపగలే దొరికిన దొంగ అని ఆరోపించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 8 స్థానాల్లో ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి, మెట్టు ప్రహ్లాద్, అజయ్, రోకండ్ల రమేష్, జంగు పటేల్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.