కరీంనగర్ స్మార్ట్ సిటీ సిగలో మరో కలికితురాయి చేరింది. నగరంలో కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి రెడీ అయింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ కరీంనగర్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నగరంలోని తీగల వంతెనను ప్రారంభించనున్నారు. ఈ వంతెన నిర్మాణానికి రూ.224కోట్లు ఖర్చయినట్లు అధికారులు తెలిపారు.
ఈ వంతెన అందుబాటులోకి వస్తే.. జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, సిరిసిల్ల తదితర జిల్లాల నుంచి కరీంనగర్ మానేరు వంతెన రహదారి మీదుగా వరంగల్, విజయవాడకు వెళ్లే వారికి ప్రయాణ భారం తగ్గనుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా నగరంలో ట్రాఫిక్ రద్ధీ కూడా తగ్గనుందని చెప్పారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా ఇప్పటికే తీగల వంతెన 500 మీటర్లు, కరీంనగర్ కమాన్ నుంచి వంతెన వరకు 300 మీటర్లు, సదాశివపల్లి వైపు 500 మీటర్ల దూరంలో రహదారి పనులు పూర్తి కాగా.. మిగిలిన 3.4 కిలోమీటర్ల వరకు భూసేకరణ చేసి అప్రోచ్ రోడ్లు నిర్మించారు.