మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర జోరుగా సాగుతోంది. లోక్సభ ఎన్నికల్లో పది నుంచి 12 ఎంపీ సీట్లే లక్ష్యంగా ఆయన ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. మిర్యాలగూడలో మొదలు పెట్టిన ఆయన యాత్ర గురువారానికి భువనగిరి చేరుకుంది. ఇక ఇవాళ కేసీఆర్ యాత్ర మహబూబ్నగర్కు వెళ్లనుంది. మహబూబ్‌నగర్‌లో కేసీఆర్ రోడ్ షోలో పాల్గొననున్నారు. ఈ మేరకు స్థానిక నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ సభల్లో కాకుండా ఇలా జనాల్లోకి రావడంతో ఆయన యాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు.
ప్రస్తుతం ఎండలు మండుతుండటంతో కేసీఆర్.. బస్సు యాత్రను సాయంకాలమే మొదలు పెడుతున్నారు. అందుకే యాత్రకు తరలివచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదు. మరోవైపు ఈ యాత్రలో కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్లపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పదేళ్లలో బీజేపీ ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేకపోయిందని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా ప్రజలకు ఏం చేయలేక పోతోందని విమర్శించారు.