మరో పరీక్షకు సిద్ధమైన టీఆర్‌ఎస్‌

-

తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో గెలుస్తూ వచ్చిన టీఆర్‌ఎస్‌.. దుబ్బాకలో ఓడిపోయింది. ఈ ఓటమిపై పార్టీలో లోతైన చర్చే జరుగుతోంది. ప్రతికూల అంశాలను గుర్తించే పనిలో ఉంది అధికార పార్టీ. అయితే ఈ లోపే టీఆర్‌ఎస్‌ మరో పరీక్షకు సిద్ధమైంది. రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీకి సవాలుగా మారాయి. గతానుభవాలను.. దుబ్బాక ఫలితం అంచనా వేస్తూ టీఆర్‌ఎస్‌ ఎలాంటి వ్యూహం అనుసరించబోతుంది అన్నది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి రేకెత్తిస్తుంది.

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరుగుతాయి. వీటిల్లో ఒకటి బీజేపీ మరొకటి టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానాలు. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదుర్కొన్న ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులను గుర్తు చేసుకుని.. మళ్లీ అలాంటివి రిపీట్ అవ్వకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఓటర్ల నమోదుపై టార్గెట్లు పెట్టుకున్న గులాబీ దళం వీలైనంత ఎక్కువ మందితో ఓటు హక్కుకు దరఖాస్తు చేయించింది.

దుబ్బాక తర్వాత వస్తోన్న జీహెచ్ఎమ్సీ తోపాటు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు పెద్ద పరీక్షే అని చర్చ మొదలైంది. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ గెలిస్తే మరోలా ఉండేది. కానీ అక్కడి ఫలితం ప్రతికూలంగా ఉండటంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎఫర్టే చేయాలని అనుకుంటున్నారట. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు మళ్లీ బరిలో దిగుతున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. గతంలో ఇక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఈసారి మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ కూడా బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్‌లో సైతం పోటీకి చాలా మంది ఆసక్తితో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఈ స్థానంలో టీఆర్‌ఎస్‌ బలమైన వ్యూహమే అనుసరించాల్సి ఉంటుంది.

ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానం నుంచి బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్న అనేక మంది అప్పుడే ప్రచారం చేస్తూనే ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోసారి బరిలో దిగే వీలుంది. కానీ.. ఇదే స్థానం నుంచి ప్రొఫెసర్‌ కోదండరామ్‌ సైతం పోటీకి సై అంటున్నారు. బీజేపీ కూడా బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. లెఫ్ట్ పార్టీలు తమ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించేశాయి. దుబ్బాక ఫలితం చూసిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని విపక్ష పార్టీలు లెక్క లేసుకుంటున్నాయి. వీటన్నింటినీ అధిగమించి.. ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో నెగ్గుకు రావడం అసలు సిసలైన పరీక్షగా భావిస్తున్నారు అధికార పార్టీ నాయకులు.

Read more RELATED
Recommended to you

Latest news