ఖమ్మం నుంచే బీఆర్ఎస్ జాతీయ రాజకీయ సైరన్ మోగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ తొలి బహిరంగసభపై పార్టీ ప్రత్యేక దృష్టిసారించారు. ఈనెల18న సభ ఘనంగా నిర్వహించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రగతిభవన్‌లో జిల్లా ప్రజాప్రతినిధులు సహా పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. సభకు 5 లక్షల మందిని సమీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జరగనున్న తొలి బహిరంగ సభ కాబట్టి అత్యంత ఘనంగా, దేశవ్యాప్తచర్చ జరిగేలా జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి సుమారు 3 లక్షలకు పైగా హాజరు కావాలని ఒక్కో నియోజకవర్గానికి కనీసం 30 వేల నుంచి 40 వేల మంది జనసమీకరణ ఉండాలని గులాబీ దళపతి స్పష్టం చేశారు. ఖమ్మం వేదికగా జాతీయ రాజకీయాలపై స్పష్టమైన అజెండా ప్రకటించనుండటంతో సభపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది. పలు రాష్ట్రాల బీఆర్ఎస్ శాఖల ఏర్పాటును అక్కడినుంచే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు సన్నాహాల్లో మునిగిపోయారు.