పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కి వరంగల్ కమిషనరేట్ పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం హాజరుకావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు పోలీసులు. అయితే ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఉన్న నేపథ్యంలో 10వ తేదీన హాజరవుతానని చెప్పారు ఈటెల. ఈ నేపథ్యంలోనే నేడు విచారణకు హాజరయ్యారు ఈటల రాజేందర్.
ఉదయం 12:50 గంటల నుండి 1:55 గంటల వరకు గంటపాటు ఈటెల రాజేందర్ ని విచారించారు పోలీస్ బృందం. విచారణ అనంతరం బయటికి వచ్చిన ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనకి ప్రశాంత్ నుండి ఎటువంటి మెసేజ్ కానీ ఫోన్ కానీ రాలేదు అన్నారు ఈటెల. తన నియోజకవర్గం నుండి ఒక కార్యకర్త ఆ మెసేజ్ ని పంపాడని.. ఆ మెసేజ్ నీ తాను ఓపెన్ కూడా చేయలేదన్నారు.
లీకేజీ అనేది ఓ అబద్ధమని.. లీకేజీకి ఆస్కారమే లేదన్నారు. కెసిఆర్ ప్రగతిభవన్ లో కూర్చుని కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు ఈటెల. కుట్రపూరితంగా తన చేతిలో అధికారులను అడ్డం పెట్టుకొని కేసులు పెట్టారని అన్నారు. 30 లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్న కేసీఆర్ ప్రజల దృష్టి మరల్చడం కోసమే ఈ కేసులతో వేధిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులతో అల్లాడుతుంటే పట్టించుకోని సీఎం ఖజానా నింపుకుంటున్నాడని ఆరోపించారు. దేశంలోనే రిచెస్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనన్నారు.