తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇవాళ వనపర్తి జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. నిరుద్యోగులు అంతా రేపు ఉదయం పది గంటల సమయంలో టీవీలు చూడాలని కోరారు సీఎం కేసీఆర్. తాను రేపు అసెంబ్లీలో 10 గంటలకు కీలక ప్రకటన చేయబోతున్నానని… ఆయన వెల్లడించారు.
దీంతో తెలంగాణ నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే సీఎం కేసీఆర్ రేపు ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేస్తారా ? లేక నిరుద్యోగ భృతిపై ప్రకటన చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం నిరుద్యోగ భృతిపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అలాగే ఈ బహిరంగ సభలో బీజేపీ పై కూడా సీఎం కేసీఆర్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
దేశంలో ఈ మధ్య గోల్ మాల్ గోవిందంగాళ్లు మోపయ్యారని సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రజలకు కుల పిచ్చి, మత పిచ్చి లేపి దుర్మార్గమైన చర్యలు చేసేలా చేస్తున్నారు. దేశాన్ని ఆగం పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దుర్మార్గమైన పద్దతిలో రాజకీయాలను మంట కలిపే ప్రయత్నం చేస్తున్నారు. కులం, మతం జాతి లేకుండా.. ప్రజలంతా బాగు పడాలని ఆయన అన్నారు. తెలంగాణలో జరిగిన విధంగానే భారత దేశం కూడా డెవలప్ కావాలని అన్నారు.