రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం పాటుపడుతుంటారని రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజాసంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం నూతన పథకాలు ప్రవేశపెడుతోందని తెలిపారు. ఇందులో భాగంగానే రెండు కొత్త పథకాలు ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు.
అందులో ఒకటే ఆరోగ్య మహిళ పథకమని మంత్రి హరీశ్ రావు అన్నారు. కరీంనగర్ వేదికగా ఇవాళ ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రారంభించుకున్నామని చెప్పారు. మరో పథకం కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్ అని.. దీన్ని శ్రీరామనవమి రోజున ప్రారంభిస్తామని తెలిపారు. గర్భిణీలకు 2 న్యూట్రీషియన్ కిట్లు ఇవ్వాలని సీఎం నిర్ణయించారని వెల్లడించారు. శిశువు గర్భంలో ఉన్నప్పుడు న్యూట్రీషియన్ కిట్ ఇస్తామని వివరించారు.
‘ఆరోగ్య మహిళలో 8 రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 100 ఆరోగ్య మహిళా కేంద్రాలు ప్రారంభిస్తాం. క్రమంగా ఆరోగ్య మహిళా కేంద్రాలు పెంచుతాం. ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మహిళలే సేవలు అందిస్తారు’ అని హరీశ్ రావు తెలిపారు.