సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కేసీఆర్ దొర ప్రసంగమంతా అబద్ధాలమయం.. అరచేతిలో వైకుంఠం అని ఆరోపించారు. పదేండ్లలో కేసీఆర్ గారు సాధించింది అప్పులు, ఆత్మహత్యలు కమీషన్లని విమర్శించారు. రాష్ట్రాన్ని చూసి దేశం నివ్వెరపోతుందో లేదో కానీ కేసీఆర్ కమీషన్లు, కబ్జాలు, దందాలు చూసి దేశమే నవ్వుకుంటుందని ఎద్దేవా చేశారు. సకల జనుల పోరాటాన్ని తెలంగాణ రూపంలో దొర చేతిలో పెడితే.. రాష్ట్రాన్ని అప్పులపాలు, అధోగతి పాలు జేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎడమకాలు చెప్పుకింద తొక్కిపెట్టాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“సర్వతోముఖాభివృద్ధి, ఉజ్వల ప్రగతి అంటే ఏంటి దొరా? నిధులు, నీళ్ళు, నియామకాలను మంటగలపడమా? రెండు సార్లు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడమా? తలసరి ఆదాయం రూ.3.17 లక్షలకు పెరిగితే .. ఒక్కొక్కరి మీద రూ.1.50లక్షల అప్పు ఎందుకు ఉన్నట్లు? 2014లో రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రం.. 2023 నాటికి 5 లక్షల కోట్ల అప్పులకు ఎందుకు చేరుకున్నట్లు? రెప్ప పాటు కరెంట్ కోతలు లేవని చెప్పి.. డిస్కంలను రూ. 26వేల కోట్ల అప్పుల్లోకి ఎందుకు నెట్టినట్లు..?
24 గంటల ఉచిత విద్యుత్ అని చెప్పి.. 9గంటలు కూడా ఇవ్వకపోవడం విద్యుత్ విజయమా! ఉమ్మడి రాష్ట్రంలోనే 18 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి బీజం పడితే.. కొత్తగా మీరు సాధించింది ఏంటి? భూపాలపల్లి ప్లాంట్ వైయస్ఆర్ ప్రారంభించినదే కదా..? జైపూర్, భద్రాద్రి ప్లాంట్లకు బీజం వేసింది కూడా మహానేతనే కదా? ఐదేండ్లలోనే మహానేత వైయస్ఆర్ 40 లక్షల పక్కా ఇండ్లు కట్టిస్తే.. తొమ్మిదేండ్లలో లక్ష ఇండ్లు కట్టలేని నువ్వు.. ఇండ్లు లేని 36లక్షల మంది ఆత్మగౌరవాన్ని కాపాడినట్లా..! 1.30 లక్షల మందికే ఈ దఫా దళితబంధు ఇస్తే.. మిగతా 18 లక్షల కుటుంబాల ఆత్మగౌరవం ఎక్కడ పోయినట్లు..?
జలయజ్ఞం ప్రాజెక్టులను సొంత ప్రాజెక్టులుగా చెప్పుకోడానికి కేసీఆర్ కి సిగ్గుండాలి. ఆనాడే 30 లక్షల ఎకరాలకు తడిపిన ఘనత వైయస్ఆర్ ది అయితే.. డిజైన్ మార్చి లక్ష కోట్లకు పెంచి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేని కాళేశ్వరం కట్టి మోసం చేసిన చరిత్ర కేసీఆర్ ది. పాలమూరు-రంగారెడ్డికి దిక్కులేదు. సీతారామ ప్రాజెక్ట్ పత్తా లేదు. పంట నష్టం కింద 14వేల కోట్లు ఇవ్వడానికి చేతులు రావు. పంట పరిహారం ఇస్తా అంటే రైతులే వద్దని చెప్పారట. 9 ఏళ్లలో రూ.2.20 కోట్ల ఎకరాలకు సాగుబడి పెరిగితే.. వరి వేస్తే ఉరి అని చెప్పిన సన్నాసి నువ్వే కదా..!
పత్తి వేయించి రైతుల్ని నిండా ముంచింది నిజం కాదా? కేజీ టూ పీజీ లేదు, ఫీజు రీయింబర్స్ మెంట్ రూ.5వేల కోట్లు బకాయిలు ఇవ్వలేదు. కనీసం బాత్ రూంలు కట్టలేనోడు.. విద్యారంగం అభివృద్ధి చెందిందని మాట్లాడుతున్నాడు. నిరుద్యోగుల ఆకాంక్ష తెలంగాణ అయితే ఇంటికో ఉద్యోగం ఎక్కడ పాయె? అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసిన ఉద్యోగాలు ఎక్కడ? 10 ఏళ్లుగా 65 వేల ఉద్యోగాలు ఇస్తే.. 50 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరిగినట్లేనా..? మెడికల్ సీట్లు పెంచినం అని చెప్పి.. కూ.ని. ఆపరేషన్లలో బాలింతలను పొట్టన పెట్టుకోవడమే మీ వైద్య వ్యవస్థ అభివృద్ధా?
తెలంగాణ ఉద్యమంలో 1200 మందికి పైగా అమరులైతే.. మీరు ఆదుకున్నది ఎంతమందిని? అమరవీరుల పేర్లు కూడా లేకుండా చేశారు కదా? 10 ఏళ్లుగా చేసింది లేదు కానీ ఎన్నికల్లో ఓట్ల కోసం పోడు పట్టాలు, గృహలక్ష్మి, లక్ష రుణం, గొర్రెలు, బర్రెలు, పనిముట్లు అంటూ కొత్త నాటకాలకు తెరలేపాడు దొర. సంపద పెంచడం – ప్రజలకు పంచడం కాదు.. సంపద వెతకడం – అమ్మడం, దొర ఖజానాకు చేర్చడం, దోచుకున్న డబ్బుతో దేశ రాజకీయాలు చేయడం.. ఇదే నవ తెలంగాణ, ఇదే తెలంగాణ మోడల్. ఉద్యమ తెలంగాణ-ఉజ్వల తెలంగాణ కాలేదు.. ఉద్యమ తెలంగాణ మళ్ళీ ఉద్యమాల తెలంగాణగానే మారింది. దొర నిరంకుశ పాలన అంతానికి మరో దఫా ఉద్యమం సాగించే సమయం వచ్చింది. దొరల పాలన అంతమైతేనే సంక్షేమ, స్వయంసమృద్ధి తెలంగాణ సాధ్యం” అని సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు షర్మిల.