నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ రైతులను పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల్లో నేతలకు డబ్బులు పంచుతున్నాడని ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సీఎం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటల బీమా పథకం అమలు చేయాలని ప్రభుత్వాన్ని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి.
ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపాలని కోరారు. మహా సంపర్క్ యాత్రకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఇక నేడు సాయంత్రం నాలుగు గంటలకు మహబూబ్నగర్ నుండి విశాఖపట్నం బయలుదేరే ట్రైన్ నెంబర్ 12862 గల ఎక్స్ప్రెస్ రైలును కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. మహబూబ్నగర్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. మహబూబ్నగర్ నుండి ఏపీలోని కోస్తా జిల్లాలు, విశాఖపట్నం తో కనెక్ట్ అవుతున్న తొలి రైలు ఇదే కావడం విశేషం.