జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహ రచన చేస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో పాగా వేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అక్కడ వరుస సభలు నిర్వహిస్తూ.. అక్కడి ప్రజలను ఆకర్షిస్తోంది. ఇప్పటికే చాలా మంది మహారాష్ట్ర నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో కేసీఆర్ ప్రసంగాలు మహారాష్ట్రలో సాగాయి.
అయితే తాజాగా ఓ న్యూస్ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తానే స్వయంగా పోటీ చేయనున్నారట. ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేస్తారనే వార్తలు ఊపందుకుంటున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరఠ్వాడాలో లోక్సభకు పోటీ చేస్తారని పార్టీ కార్యాలయ వర్గ సమాచారం.
మహారాష్ట్రలో పార్టీ బలాన్ని పెంచేందుకు కేసీఆరే స్వయంగా రాబోయే మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీని కోసం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం జల్లెడపడుతున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ కిసాన్ అఘాడీ రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదమ్ తెలిపారు.