ఎడిట్ నోట్: కాంగ్రెస్ ‘కీ’ ప్రామిస్.!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అక్కడ కాంగ్రెస్ గెలవడానికి చాలా కారణాలు ఉన్నాయి. బి‌జే‌పిపై వ్యతిరేకత, కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై వ్యతిరేకత రావడం, కాంగ్రెస్ నేతలు సమిష్టిగా పనిచేయడం..అన్నిటికంటే పేద, మధ్య తరగతి ప్రజలని ఆక్ట్టుకునేలా కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఇవ్వడం. గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని చెప్పడం, ఇంటికి నెలకు 10 కిలోల బియ్యం, మహిళలకు నెలకు 2 వేలు ఇలా కొన్ని పథకాలకు సంబంధించి హామీలు ఇచ్చినట్లు తెలిసింది.

ఏదేమైనా గాని అక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది. అదే తరహాలో తెలంగాణలో కూడా సత్తా చాటాలని ఇక్కడి నేతలు దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. మొన్నటివరకు సఖ్యతగా లేని నాయకులు ఇప్పుడు..సఖ్యతగా ఉంటూ పార్టీ కోసం పనిచేయడం మొదలుపెట్టారు. అలాగే ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ కీలక హామీలని ప్రకటిస్తూ వస్తుంది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ప్రియాంక గాంధీ చేత..నిరుద్యోగ భృతి నెలకు 4 వేలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. ఇలా కొన్ని కీలక హామీలు ఇచ్చారు.

Congress

తాజాగా భట్టి విక్రమార్క పాదయాత్ర 800 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జడ్చర్లలో భారీ సభ పెట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు పలు హామీలు ఇచ్చారు. అందులో కీలకంగా మహిళల ఓట్లని ప్రభావితం చేసేలా గ్యాస్ సిలిండర్‌ని రూ.500కే ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధర 1200 దాటేసింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుంది. ఇక రైతులకు 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలు..4 వేల నిరుద్యోగ భృతి అంటూ కీలక హామీలు ఇచ్చింది. మరి ఈ హామీలు జనంలోకి ఎంతవరకు వెళ్తాయి..ఇవి ఓట్లుగా మారి కాంగ్రెస్‌కు ఏ మేర లబ్ది జరుగుతుందో చూడాలి.