యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి: కేసీఆర్

-

మారిన కాలమాన పరిస్థితుల్లో యువత మరింత సమర్థవంతంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం (World Youth Skills Day) సందర్భంగా రాష్ట్ర యువతకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సాధించుకున్న రాష్ట్ర ఫలాలను వర్తమాన, భవిష్యత్తు యువతరానికి పూర్తిస్థాయిలో అందించేలా ప్రభుత్వం తెలంగాణను తీర్చిదిద్దుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సమీకృత అభివృద్ధి కార్యాచరణ సత్ఫలితాలనిస్తున్నదని, పలు పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంతో గ్రామీణ యువతకు ఉపాధి పెరుగుతుందని అన్నారు. పట్టణాల్లో ఉపాధి రంగాలను మెరుగుపరిచే కార్యక్రమాలను అమలు చేస్తూ వాటి ఫలాలను యువతకు అందించే స్థాయికి చేరుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

తెలంగాణ యువత ఎంతో సమర్థవంతమైందని..వారికి నైపుణ్యాలు తోడయితే తిరుగులేని యువశక్తిగా అవతరిస్తుందన్నారు. యువతలో నైపుణ్యాల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని సీఎం తెలిపారు. ఐటి సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు లభించే దిశగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK)ని దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేసిందని గుర్తు చేసారు. టాస్క్ ద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న యువతీ యువకులకు సాంకేతిక, సాంకేతికేతర పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణను అందిస్తున్నామన్నారు. యువతను ప్రోత్సహించేలా ఐటీ పాలసీని రూపొందించామన్నారు. ప్రత్యేకంగా టీ-సాట్ ద్వారా నిరుద్యోగ యువతకు వివిధ స్థాయిల్లో అవగాహనతో పాటు శిక్షణా కార్యక్రమాలను అందిస్తున్నామని సీఎం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news