జులై మొదటి వారంలో కేంద్రమంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరుగనున్నట్లు సమాచారం అందుతోంది. జూలై 17 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే కేంద్రమంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం ఉందట. అయితే.. ఈ సారి కేంద్రమంత్రివర్గంలో తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
వచ్చే సోమవారం “కేంద్ర మంత్రి మండలి” ( యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్) సమావేశం తర్వాత, ఏ క్షణంలోనైనా కేంద్రమంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరుగనున్నాయని సమాచారం. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల బిజేపి అధ్యక్షుల నియామకాలకు సంబంధించి బిజేపి అధినాయకత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయాలను బట్టి కేంద్రమంత్రి వర్గంలో తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కే అవకాశం ఉందట. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కి తెలంగాణ బిజేపి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే, ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ కు కేంద్రమంత్రివర్దంలో చోటు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.