హైదరాబాద్‌లో మంగళవారం రోజున రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వానకు నగర వాసులు బెంబేలెత్తిపోయారు. ఈదురుగాలులతో కూడిన వానతో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. తెల్లవారుజాము వరకు కుండపోతగా కురిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. పలుచోట్ల రోడ్లపైకి నీరుచేరడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే వరద నీరు నిలిచినచోట జీహెచ్‌ఎంసీ బృందాలు రంగంలోకి దిగాయి.
హైదరాబాద్‌లో భారీ వర్షానికి రహమత్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఓ అపార్ట్మెంట్ గోడ పక్కనే ఉన్న రేకుల షెడ్డుపై కూలిపోయింది. ఈ ఘటనలో ఆ షెడ్డులో తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న 8 నెలల చిన్నారిపై గోడ శిథిలాలు పడి మృతి చెందింది. ఈ ఘటనలో దంపతులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది ఘటనాస్థలికి చేరారు. సహాయక చర్యలు చేపట్టి దంపతులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.