బండితో రాజగోపాల్‌రెడ్డి భేటీ… ఆ విషయాలపై చర్చ!!

మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి… భాజపాలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ఆయన భేటీ అయ్యారు. యాదాద్రి జిల్లా పంతంగి వద్ద మాజీ ఎంపీలు వివేక్, విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి బండి సంజయ్‌తో రాజ్‌గోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు.

భవిష్యత్‌ కార్యాచరణపై బండితో చర్చించిన ఆయన.. భాజపాలో చేరిక తేదీ.. బహిరంగ సభ అంశంపై చర్చించారు. ఇప్పటికే దిల్లీలో పార్టీ జాతీయ నేతలతో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. అక్కడే పార్టీలో చేరాల్సి ఉన్నా….. తన నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి, అమిత్‌షా సమక్షంలో పార్టీలో చేరుతానని ఆయన చెప్పినట్లు భాజపా వర్గాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈ నెల 21న ‘షా’ సమయం ఇవ్వటంతో….. రాజ్‌గోపాల్‌తో పాటు మరికొందరు కమలం గూటికి చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విషయమై బండి సంజయ్‌తో చర్చించిన రాజ్‌గోపాల్‌….. బహిరంగ స్థలం, ఇతర ఏర్పాట్ల గురించి చర్చించారు.