స్వ‌రం మార్చిన కొండా సురేఖ‌!

ఏపీ తెలంగాణ విభ‌జ‌న‌కు ముందు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి అత్యంత సన్నిహితంగా వున్న తెలంగాణ నేత‌లు స‌బితా ఇంద్రారెడ్డి, దానం నాగేంద‌ర్‌, కొండా సురేఖ‌, కొండా ముర‌ళి. ఈ న‌లుగురిలో వైఎస్ కుటుంబంతో ఆర్థిక లావాదేవీల విష‌యంలో అనుబంధం వున్న నాయ‌కులు మాత్రం ఇద్ద‌రే వారే కొండా దంప‌తులు. సాక్షీలో వారి పెట్టుబ‌డులు వున్నాయ‌ని అప్ప‌ట్లో బాహాటంగానే వార్త‌లు వినిపించాయి. వాటిని ఏనాడూ కొండా దంప‌తులు ఖండించ‌లేదు.

వైఎస్ త‌ద‌నంత‌రం వైఎస్ జ‌గ‌న్‌కు ఈ జంట అండగా నిలిచింది. తెలంగాణ ఉద్య‌మం ఊపందుకున్న వేళ మానుకోట సంఘ‌ట‌న అప్ప‌ట్లో రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఆ రోజు జ‌రిగిన బాహా బాహీలో కండా మురళి గులాబీ శ్రేణుల‌పై గ‌న్ పేల్చ‌డం తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. దానికి ప్ర‌తిగా తెరాస నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కొండా వ‌ర్గంపై రాళ్ల‌దాడికి దిగ‌డం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఆ త‌రువాత వైఎస్ జ‌గ‌న్‌తో ఏర్ప‌డిన అభిప్రాయ బేధాల కార‌ణంగా కొండా జంట వైసీపీని వీడింది. ఆ త‌రువాత తెర‌స గూటికి చేరింది. కేసీఆర్‌తోనూ మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో పార్టీ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన ఈ జంట తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి విమ‌ర్శ‌లు గుప్పించింది.

కాంగ్రెస్ పార్టీలోనూ త‌మ వ‌ర్గానికి ఎలాంటి ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంతో గ‌త కొంత కాలంగా మౌనం వ‌హిస్తూ వ‌స్తున్న కొండా దంప‌తులు మ‌ళ్లీ స్వ‌రం పెంచ‌డం మొద‌లుపెట్టారు. తాజాగా ఉభ‌య తెలుగు రాష్ట్రాల ముఖ్యంమంత్రుల‌పై సంచ‌ల‌న విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒక‌ప్పుడు బ‌ద్ధ శ‌త్రువులుగా వున్న వైఎస్ జ‌గ‌న్‌, కేసీఆర్ ఎలా క‌లిశార‌ని, అప్పుడు వ్య‌తిరేకించిన కేసీఆర్ ఇప్పుడెందుకు జ‌గ‌న్‌ని వెన‌కేసుకొస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. ఇరిగేష‌న్ ప్రాజెక్టులు క‌డుతూ తెలంగాణకు జ‌గ‌న్ అన్ఆయం చేస్తుంటే కేసీఆర్ చూసి చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, వీరిద్ద‌రి మ‌ధ్య లోపాయ‌కారి ఒప్పందం జ‌రిగింద‌ని ఇద్ద‌రు సీఎంల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.  ఉన్న‌ట్టుండి సురేఖ స్వ‌రం మార్చ‌డం, త‌న వ్యాఖ్య‌ల‌కు ప‌దును పెట్ట‌డం వెన‌క రాజ‌కీయంగా త‌మ ఉనికిని చాటుకోవాల‌నే ప్లాన్ క‌నిపిస్తోంద‌ని రాకీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.