తెలంగాణ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. వచ్చే నెలలో చైనా వెళ్లనున్నారు. జూన్ 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆ దేశంలోని టియాంజిన్‌లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు.
ఈ మేరకు ఆయనకు ఆహ్వానం అందింది. తెలంగాణలో వ్యవస్థాపకత, ఆవిష్కరణ, డిజిటల్ పరివర్తన’ అనే అంశంపై కేటీఆర్ తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ సదస్సులో 15 వందల మంది ప్రతినిధులు పాల్గొంటారని వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గే బ్రెండే తెలిపారు.
ఇది ఇలా ఉండగా, అమరరాజా బ్యాటరీస్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఏర్పాటుచేస్తున్న గిగా కారిడార్ ప్రాంగణానికి రేపు శంకుస్థాపన జరగనుంది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అమరరాజా గ్రూపు ఫౌండర్ రామచంద్ర, సీఎండీ జయదేవ్ తదితరులు పాల్గొంటారు. ఈ కారిడార్.. లిథియం సెల్ బ్యాటరీ ప్యాక్ తయారీకి అతిపెద్ద కర్మాగారంగా నిలవనుంది. ఈ యూనిట్ నిర్మాణాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేసి ఉత్పత్తి చేపట్టనున్నారు.