హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ కి దమ్ముంటే ఆ బీజేపీ ఎంపీ ఎవరో పేరు చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ఉండి అవినీతికి సంబంధించిన విషయాలు తెలిసి కూడా పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.
తప్పులన్నీ కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి చేసి ఆరోపణలు మాత్రం బీజేపీ పై వేస్తున్నారని మండిపడ్డారు. ఐసీఐసీఐ నుంచి రుణాలు తీసుకుంటే.. ముందు ఆ బ్యాంకు పై విచారణ జరగాలన్నారు. ఇదివరకే HCU కి ఇచ్చిన భూములపై అప్పు ఎలా తెస్తారని నిలదీశారు. ఈ విషయంలో కచ్చితంగా విచారణ జరగాలన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములు యూనివర్సిటీ పేరున చేస్తే.. ఈ అంశం ముగిసిపోతుందన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ ఆ పని చేయలేదని, HCU భూములపై కేటీఆర్, కవితకు మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు.