‘ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు?’… అమిత్​షాకు కేటీఆర్​ బహిరంగ లేఖ

తెలంగాణ పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణకు బీజేపీ చేస్తున్న అన్యాయాలపైన ప్రశ్నలు సంధించిన మంత్రి కేటీఆర్…. తెలంగాణ పట్ల చిత్తశుద్ది ఉంటే తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని మంత్రి సవాల్ విసిరారు. తెలంగాణపై బీజేపీ పార్టీది అదే కక్ష అని… ఎనిమిదేళ్లు గడిచినా అదే వివక్ష. కేంద్రం కడుపు నింపుతున్న తెలంగాణ కడుపు కొట్టడం మానడం లేదని ఫైర్‌ అయ్యారు.

ప్రతిసారి వచ్చుడు.. స్పీచులు దంచుడు.. విషం చిమ్ముడు.. మళ్లీ పత్తా లేకుండా పోవుడు. ఇదే బిజెపి కేంద్ర నాయకులకు అలవాటుగా మాదిందని… ఇంకెంతకాలం తెలంగాణపై ఈ నిర్లక్ష్య ధోరణి అని ఓ రేంజ్‌ ఫైర్‌ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ఏ ముఖం పెట్టుకుని వస్తావని అమిత్‌ షాను ప్రశ్నించారు కేటీఆర్‌.

తెలంగాణకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చని బీజేపీ… గుజరాత్ కు మాత్రం ఇవ్వని హామీలు కూడా ఆగమేఘాల మీద అమలు చేయడం దేనికి సంకేతమని నిలదీశారు. ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అస్థిత్వాన్ని కూడా ప్రశ్నించడం బీజేపీకే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని…. మరోసారి తెలంగాణ గడ్డపై అమిత్ షా అడుగుపెడుతున్న వేళ… విభజన చట్టంలో ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజల సాక్షిగా కేంద్రం దృష్టికి తేవడంతోపాటు, వాటి కోసం తెగేదాక కొట్లాడటం మా బాధ్యత అన్నారు.