పుడమిని కాపాడుకునేందుకు సమష్టిగా పనిచేయాలి: కేటీఆర్

-

నేడు తెలంగాణ వ్యాప్తంగా ఏడో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్(KTR)…రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్ కలాన్ వద్ద  అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో మొక్కలు నాటి హరితహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ మొక్కలు నాటారు. అనంతరం మంత్రులు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హరితహారాన్ని మించిన ఉదాత్త, గొప్ప కార్యక్రమం లేదని అన్నారు. భవిష్యత్ కోసం పుడమిని కాపాడుకునేందుకు అందరమూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

కేటీఆర్/ KTR
కేటీఆర్/ KTR

హరితహారం ద్వారా రూ.5900 కోట్ల వ్యయంతో 220 కోట్ల మొక్కలు నాటి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మానవప్రయత్నం కొనసాగుతోందన్నారు. తెలంగాణలో పచ్చదనం 23.4 శాతం నుంచి 28 శాతానికి పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు కోసం 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్న కేటీఆర్.. హెచ్ఎండీఏ పరిధిలో రూ.650 కోట్లతో 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మానవాళికి అత్యవసరమైన ప్రాణవాయువును అందించడంలో అర్బన్ ఫారెస్ట్ పార్కులు కీలకంగా మారతాయన్నారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుల స్పూర్తితో కేంద్రం నగరవన్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.

పచ్చదనం పెరిగేలా చట్టాలలో కఠినమైన నిబంధనలు పెట్టామని… 85 శాతం మొక్కలు బతకపోతే స్థానిక ప్రజాప్రతినిధులను పదవుల నుంచి తొలగించే నిబంధనలు పెట్టినట్లు కేటీఆర్ గుర్తు చేసారు. పచ్చదనాన్ని 33 శాతానికి చేరుకోవాలన్న సీఎం కేసీఆర్ కల నెరవేరి దేశానికే పాఠాలు చెప్పే ఆదర్శరాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని ఆకాంక్షించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… దేశంలో 15 వేలకు పైగా నర్సరీలు తెలంగాణలో తప్ప ఎక్కడా లేవన్నారు. అర్బన్ ఫారెస్ట్ పార్కులన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news