తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా సుప్రసిద్ధ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయ ప్రాంగణాలు, పరిసరాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. వేకువ జామునుంచి భక్తజనం దేవాలయాలకు పోటెత్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పరమేశ్వరుడిని దర్శించుకుని స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
శ్రీగిరి క్షేత్రం శ్రీశైలం, శ్రీకాళహస్తి, శ్రీముఖలింగం, రావివలస, మహేంద్రగిరి, రామతీర్థం, నర్సీపట్నం, వేములవాడ, కీసర తదితర ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది. హరహర మహాదేవ శంభోశంకర, శివోహం అంటూ భక్తులు పరమశివున్ని స్మరిస్తున్నారు. శివునికి మహాప్రీతిపాత్రమైన మహాశివరాత్రి రోజున బిల్వార్చకం, రుద్రాభిషేకాలతో ఆ ముక్కంటి సేవలో తరిస్తున్నారు.
మరోవైపు వేములవాడ ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కొనసాగుతోంది. శివయ్య దర్శనం కోసం భక్తులు నిన్న రాత్రి 11 గంటల నుంచి క్యూలైన్లలో వేచి ఉన్నారు. దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు ఇవాళ వేకువజాము నుంచి రాజరాజేశ్వర స్వామికి అభిషేకం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అర్చకులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.