నన్ను ఓడించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి – మంత్రి పువ్వాడ

గత ఎన్నికలలో తనని ఓడించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం జిల్లా దోరేపల్లి ఫంక్షన్ హాల్ లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ 2 టౌన్ కమిటీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కొందరు వేషాలతో వస్తారని, ఎన్నికల తర్వాత వారు మళ్ళీ కనబడరని పొంగులేటిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

తాను మాత్రం అన్నివేళలా ప్రజలకి అందుబాటులోనే ఉంటానని తెలిపారు. ఎవరు మాటలు చెబుతున్నారో విజ్ఞులైన ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. రైతులు, పేద ప్రజల పక్షాన నిలబడ్డ కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న కేంద్ర బీజేపీపై ప్రజలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. బిజెపి, కాంగ్రెస్ అసత్య ప్రచారాలను బిఆర్ఎస్ శ్రేణులు సమర్థవంతంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. అయితే తనలో కూడా లోపాలు ఉంటాయని.. పార్టీని కాదని ముందుకు పోలేనని పేర్కొన్నారు.