మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించడానికి ప్రధాన కారణం వామపక్షాలేనని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సీపీఐ, సీపీఎం నాయకుల ప్రచారం వల్లే తాము గెలవగలిగామని చెప్పారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని ఫిక్స్ అయ్యామని స్పష్టం చేశారు. సాఫీగా సాగుతున్న పాలనలో ఉపఎన్నిక తీసుకొచ్చి అలజడి సృష్టించారని మండిపడ్డారు.
కమ్యూనిస్టు నేతల సహకారంతోనే కూసుకుంట్ల గెలుపు సాధ్యమైందని.. భవిష్యత్తులోనూ వారితో కలిసి ముందుకు వెళ్తామని చెప్పారు. వామపక్ష నేతలను కలిసిన మంత్రి జగదీశ్ రెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వామపక్షాలతో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ వారితో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు.. రాష్ట్రాన్ని పెద్ద విపత్తు నుంచి కాపాడటం సంతోషంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని రాజగోపాల్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని బీజేపీ భావిస్తోందని కానీ ఆ పార్టీకి తెలంగాణలో బలం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు