కాంగ్రెస్ ప్రజాపాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయలేక ప్రజాపాలన పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎలాంటి అప్లికేషన్లు లేకుండానే తాము లబ్ధిదారులను ఎంపిక చేశామని, ఇప్పుడు దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అయోమయానికి గురి చేస్తుందని విమర్శలు గుప్పించారు. ప్రజలు అడిగేది పథకాలు, పత్రాలు కాదని జగదీష్ రెడ్డి అన్నారు. దరఖాస్తులు లేకుండా.. దళారీ వ్యవస్థ లేకుండా తాము ఆన్ లైన్ విధానం ద్వారా అర్హులను ఎంపిక చేశామన్నారు.
ఆరు గ్యారెంటీల దరఖాస్తు ఫారాలు అసంబద్ధంగా ఉన్నాయని విమర్శించారు. ఆ పత్రాల డ్రామాలు ఎంతోకాలం సాగవన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మోసాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారని.. హామీలు అమలు చేయకుంటే అదే ప్రజలు మీ వెంటపడి కారు తరుముతారని జగదీష్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో ఉద్యమకారుల FIR రికార్డులు లేకుండా చేసి ఇవాళ వివరాలు అడుగుతున్నారని దుయ్యబడ్డారు. దమ్ముంటే నల్లగొండ జిల్లాకు తాము చేసిన దాంట్లో 10% చేయాలని మాజీ మంత్రి సవాల్ విసిరారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని అన్నారు. 9న రుణమాఫీ, నాలుగున రైతుబంధు అని కోతలు కోశారు. అమలు ఎక్కడా అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.