రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ముగియడంతో ఇక నాయకులంతా వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు.. ఇతర పెండింగ్ అంశాల పరిష్కారంపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగానే.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారం దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మంత్రి కేటీఆర్ రెండు రోజులపాటు దిల్లీలో పర్యటించనున్నారు. శుక్ర, శనివారాల్లో పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఆయా అంశాలపై చర్చిస్తారని పార్టీ వర్గాల సమాచారం.
రాష్ట్ర సర్కారు హైదరాబాద్ నగరంలో ఎస్సార్డీపీ కార్యక్రమంలో భాగంగా తలపెట్టిన స్కైవేల నిర్మాణం కోసం కంటోన్మెంట్ భూములు ఇవ్వాలంటూ రక్షణశాఖను ఎప్పట్నుంచో కోరుతున్నా అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో తాజా పర్యటనలో కేటీఆర్ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్లు సమాచారం.