గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించిన తీరుపై టీఎస్‌పీఎస్సీని హైకోర్టు ప్రశ్నించింది. బయోమెట్రిక్ ఎందుకు అమలు చేయలేదని, కనీసం హాల్‌టికెట్ నంబర్లు లేకుండా ఓఎంఆర్ షీట్లను ఎలా జారీ చేశారని, ఇదేం విధానమని ప్రశ్నలు సంధించింది. ఒకరి బదులు మరొకరు పరీక్షకు హాజరవకుండా నిరోధించడానికి ఇలాంటి కనీస జాగ్రత్తలు అవసరమని వ్యాఖ్యానించింది. గత ఏడాది అక్టోబరులో అమలుచేసిన విధానం ఇప్పుడెందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది.
బయోమెట్రిక్ విధానానికి ఖర్చు ఎక్కువన్న టీఎస్‌పీఎస్సీ వాదనను తోసిపుచ్చుతూ.. ఇక్కడ ఖర్చు ప్రామాణికం కాదని, పారదర్శకత ముఖ్యమని వ్యాఖ్యానించింది. అభ్యర్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నపుడు పటిష్ఠంగా ఏర్పాట్లు ఎందుకు చేయరన్నారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయడం కమిషన్ బాధ్యతని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు.
బయోమెట్రిక్ లేకుండా ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను రద్దుచేసి తాజాగా నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ బి.ప్రశాంత్ మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం జస్టిస్ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు.