4 దశాబ్దాలు పూర్తి చేసుకున్న అంబెడ్కర్ యూనివర్సిటీ కి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్. నీళ్లు, నిధులు, నియామకాలు… ధ్యేయంగా తెలంగాణ కోసం ఉద్యమించామని.. ఆ దిశగా రాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. కానీ… ఈరోజు ఎక్కడెక్కడ నుంచో.. ఎవరెవరో వచ్చి… ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్… కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ లో ఉందన్నారు.
అలాంటి ప్రాజెక్ట్ లో ఉన్న చిన్న చిన్న లోపాలను కూడా భూతద్దం పెట్టి వెతికి… అనవసరమైన కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. ఓర్వలేక కాళేశ్వరం పై ఏడుస్తున్నారని అన్నారు. 8 ఏళ్లలో ఏం చేశారు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారని.. కొత్త జల ప్రాజెక్టులు కట్టి, ఉన్న సవాళ్లను అధిగమించి ఎదుర్కొన్నామన్నారు. చెరువులను అభివృద్ధి చేసుకున్నామన్నారు. అమెరికా కు మంత్రి గా నాలుగైదు సార్లు వెళ్లి వచ్చానని.. అక్కడ ఓ రాష్ట్రంలో 10వేల చెరువులు ఉన్నాయని చెప్పారు.
కానీ మన దగ్గర 46 వేల చెరువులు ఉన్నాయని చెప్పారు. ఈ చెరువులను బాగు చేసుకుంటే ఇవన్నీ కలిపి ఒక నాగార్జున సాగర్ లాగా తయారువుతుందని అన్నారు. అందుకే వాటిని పునరుద్ధరణ చేసామన్నారు. గతంలో మాదిరిగా చెరువుల కట్టలు తెగే పరిస్థితి లేదని అన్నారు. సిరిసిల్ల జిల్లా తో పాటు చుట్టూ ఉన్న జిల్లా ప్రాంతాలు కూడా దుర్భిక్షం గా ఉండేదని.. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో పాటు చెరువుల అభివృద్ధి తో గ్రౌండ్ లెవల్ వాటర్ పూర్తిగా పెరిగిందన్నారు. హైదరాబాద్ తో పాటు కొన్ని జిల్లాలకు రాబోయే శతాబ్దం వరకు మంచి నీటిని అందించే ప్రాజెక్ట్ కాళేశ్వరం అని అన్నారు.