ప్రజాపాలనకు వస్తున్న స్పందన చూసి బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ భోలక్‌పూర్‌లో పర్యటించిన ఆయన ప్రజాపాలన దరఖాస్తుల కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లోనే 6 గ్యారెంటీలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేశామని వెల్లడించారు. ఆటోడ్రైవర్లతో ధర్నా చేయించడంలో బీఆర్ఎస్ ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వద్దని బీఆర్ఎస్ నేతలు చెబుతారా? అని అడిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మేలు జరుగుతోంటే బీఆర్ఎస్ సహించలేకపోతోందని మంత్రి పొన్నం దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా తాము నెరవేర్చుకుంటూ వెళ్తోంటే గులాబీ నేతలకు మింగుడు పడటం లేదని అన్నారు. ఆటో డ్రైవర్లు ఆ నేతల మాటల్లో పడి మోసపోవద్దని సూచించారు. ప్రతిపక్షాల చెరలో పడొద్దని.. వారికి న్యాయం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన విజయవంతంగా కొనసాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.