ఇంటర్‌ సెకండియర్ పరీక్షలు రద్దు చేయలేదు

తెలంగాణలో ఇంటర్‌ సెకండియర్ పరీక్షలు రద్దు అయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. ఇంటర్‌ సెకండియర్ పరీక్షలు రద్దు అయినట్లు జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. ఇంటర్‌ పరీక్షల రద్దు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆమె వెల్లడించారు. వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.ఇంటర్‌ పరీక్షలపై సమీక్ష తర్వాతే ప్రకటన చేస్తామని ఆమె స్పష్టం చేశారు.


కాగా కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన విషయం తెల్సిందే. అయితే ఇంటర్‌ సెకండియర్ పరీక్షలపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. మంగళవారం కేబినెట్‌ భేటీలో ఇదే అంశంపై చర్చించిన కూడా ప్రభుత్వం దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే బుధవారం ఉదయం తెలంగాణలో ఇంటర్‌ సెకండియర్ పరీక్షలు రద్దు అయినట్లు వార్తలు వచ్చాయి.