ధాన్యం కొనుగోళ్ళ పై పలు శాఖల అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్ళు ఊపందుకున్న దృష్ట్యా వరి సేకరణ, తరలింపు, నిల్వలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వేర్ హౌసింగ్ కార్పోరేషన్ ఇంచార్జ్ ఎండి ఉదయ్ కుమార్, ఆగ్రోస్ ఎండీ రాములుకి ఆదేశాలు జారీ చేసారు మంత్రి. రాష్ట్రంలో వడ్ల సేకరణకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు అవసరమైన సామాగ్రిని అన్ని కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని, కోతలు, సెంటర్లకు వస్తున్న ధాన్యాన్ని బట్టి అవసరమైతే మరిన్ని క్లీనర్లు ఏర్పాటు చేయాలన్నారు మంత్రి తుమ్మల.
అలాగే పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమన్వయంతో పనిచేస్తూ రైతులకు కొనుగోళ్ళలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక ప్రస్తుతం 29.537 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యము అందుబాటులో ఉందని, కొనుగోళ్ళకు తగ్గట్లుగా మరింత నిల్వ సామర్ధ్యాన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు తుమ్మల నాగేశ్వరరావు.