కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కాల్సిందేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు, ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని న్యాయవాదులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. నీటిపారుదల శాఖకు సంబంధించి సుప్రీంకోర్టు, ట్రైబ్యునళ్ల ముందు ఉన్న అంశాలపై సీనియర్ న్యాయవాదులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఇందులో సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్, రవీందర్‌రావు, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్రైబ్యునల్ తీర్పు వచ్చేవరకు 50 శాతం వాటా కోసం ప్రయత్నించాలన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించేది లేదని తేల్చి చెప్పారు. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసినట్లు గుర్తు చేశారు. కృష్ణా జలాల సాధనలో ప్రజాప్రయోజనాలే కీలకమని.. దీనికి అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.