ఆర్థిక సమస్యలు ఆ కుటుంబంలో రెండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. జీతం చాలక ఆర్థిక సమస్యలతో ఏడాది కిందట భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది తర్వాత భార్య కూడా అదే కారణంతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో చోటుచేసుకుంది. చాలీచాలని జీతంతో పిల్లలను సాకలేకపోతున్నానని లేఖ రాసి మిషన్ భగీరథ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది.
తిరుమలగిరిసాగర్ మండలం అల్వాల గ్రామానికి చెందిన సింగం పుష్పలత (26) భర్త మహేష్ పానగల్ మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసేవాడు. వీరికి ఒక పాప సాన్విత, కుమారుడు సాయినందన్ ఉన్నారు. జీతం చాలక ఆర్థిక సమస్యలతో ఏడాది కిందట మహేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఉద్యోగం పుష్పలతకు ఇచ్చారు. ఆమె హాలియాలోని సాయిప్రతాప్‌నగర్ కాలనీలో ఒక గది అద్దెకు తీసుకుని ఇద్దరు పిల్లలతో జీవిస్తోంది. గురువారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుంది.
ఆమె పుస్తకంలో రాసిన సూసైడ్ నోట్ రాసి ఉంది. అందులో జీతం రూ. 9500 చాలకపోవడం… అది కూడా సకాలంలో అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నానని పేర్కొంది. తనకు కడుపులో గడ్డ ఉందని.. ఆపరేషన్‌కు రూ. 2 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్ చెప్పారని పేర్కొంది.