ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్ లో కోర్టు విచారణకు హాజరయ్యారు. 2022 ఫిబ్రవరి 03న యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జరిగిన కాల్పుల ఘటన పై హాపూర్ కోర్టులో జరిగిన విచారణకు అసదుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు. అసదుద్దీన్ ఒవైసీ కోర్టుకు హాజరైన సందర్భంగా కోర్టు పరిసరాలలో భారీ బందో బస్తు ఏర్పాటు చేసారు. కేసు పూర్వ పరాల్లోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు అని ఢిల్లీకి బయలుదేరిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పై దుండగులు కాల్పులు జరిపారు.
మీరట్ కి సమీపంలో కితౌర్ లో ప్రచారం ముగించుకొని రోడ్డు మార్గం గుండా ఢిల్లీకి వెళ్తుండగా.. చాజౌరీ టోల్ గేట్ వద్ద అసదుద్దీన్ ఒవైసీ ప్రయాణిస్తున్న కారు పై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. దుండగులు తన కారుపై మూడు నుంచి నాలుగు రౌండ్ల కాల్పులకు పాల్పడినట్టు అసదుద్దీన్ ఒవైసీ అప్పట్లో మీడియాకు వెల్లడించారు. అయితే అసదుద్దీన్ ఒవైసీ వాహనం పై కాల్పులు జరిపిన ఇద్దరూ వ్యక్తులకు బెయిల్ మంజూరు చేస్తూ.. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గతంలోనే సుప్రీంకోర్టు రద్దు చేసింది.