వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం కాంగ్రెస్‌దేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70-80 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు వద్ద మంగళవారం ఆయన కార్యకర్తల మధ్య జన్మదినాన్ని జరుపుకొన్నారు.
రాబోయే ఎన్నికల్లో తనను ప్రజలు నల్గొండ ఎమ్మెల్యేగా గెలిపిస్తారని.. కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు రాకుంటే రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి చెప్పారు. తమ పార్టీలో వర్గపోరు లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పారు. ఈనెల 26న ముఖ్య నాయకులతో రాహుల్ గాంధీ, ఖర్గే సమావేశం అవుతారన్నారు. 10 రోజుల్లో ప్రియాంకతో నల్గొండలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సభలో సీఎం సీఎం అని అభిమానులు నినాదాలు చేస్తుండగా.. ‘నన్ను అలా అనొద్దు. మీరు అలా అంటే అంతా కలిసి నన్ను ఓడిస్తారు’ అని అన్నారు.