హైదరాబాద్ సరూర్ నగర్ లో జరిగిన పరువు హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. మతాంతర వివాహం చేసుకున్నందుకు కక్ష పెంచుకుని ఈ దురాగతానికి పాల్పడ్డారు. వికారాబాద్ కు చెందిన నాగరాజు, ఆశ్రీన్ లు ఇద్దరు మతాంతర వివాహం చేసుకున్నారు. అయితే ఇది సహించలేదని ఆశ్రీన్ సోదరులు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై సరూర్ నగర్ లో హత్య చేశారు.
ఇదిలా ఉంటే ఈ ఘటనపై గవర్నర్ తమిళిసై స్పందించారు. నాగరాజు హత్యోదంతంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని శాంతిభద్రతలపై గవర్నర్ తమిళిసై నివేదికలు కోరుతున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ మంత్రి, పోలీసులు వేధింపులతో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే విధంగా కామారెడ్డి జిల్లాలో అధికార పార్టీ మున్సిపల్ చైర్ పర్సన్, ఇతర నేతల వేధింపుల కారణంగా తల్లి కోడుకులు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈరెండు ఘటనలపై కూడా గతంలో గవర్నర్ తమిళి సై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరారు.