తెలంగాణలో అధికార బిఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టేలా కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీలోని బలమైన నేతలని కాంగ్రెస్ లోకి తీసుకుంటుంది. ఇప్పటికే పలువురు నేతలని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఇంకా పలువురు నేతలని బిఆర్‌ఎస్ లోకి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కీలక నేత మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుని కాంగ్రెస్ లోకి తీసుకురావాలని చూస్తున్నారు.
ఈయన పార్టీలోకి వస్తే నిజామాబాద్ లో కాంగ్రెస్ కు కొత్త బలం వస్తుందని చూస్తున్నారు. ఇక మండవ వచ్చి టిడిపి అధినేత చంద్రబాబు సన్నిహితుడు..2018 ఎన్నికల వరకు ఈయన టిడిపిలోనే పనిచేశారు. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా కవితని గెలిపించుకోవాలని చెప్పి కేసిఆర్..డైరక్ట్ మండవ ఇంటికెళ్ళి ఆయన మద్ధతు తీసుకున్నారు. అయినా సరే కవిత గెలవలేదు. తర్వాత మండవ బిఆర్‌ఎస్ లో అంత యాక్టివ్ గా లేరు. ఆయనకు ఏ పదవి కూడా రాలేదు. ఈయనతో పాటు బిఆర్‌ఎస్ లోకి వచ్చిన సురేష్ రెడ్డికి మాత్రం రాజ్యసభ దక్కింది.
ఇక బిఆర్‌ఎస్ కు దూరంగా ఉన్న ఈయనని ఇప్పుడు కాంగ్రెస్ లోకి తీసుకురావాలని రేవంత్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో మండవ సన్నిహితుడు, నిజామాబాద్ లో కీలకంగా ఉన్న అరికెల నర్సారెడ్డిని బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మండవని కూడా తీసుకొస్తే నిజామాబాద్ లో కాంగ్రెస్ బలం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
మండవ గతంలో టిడిపిలో..డిచ్‌పల్లి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నిజామాబాద్ రూరల్ గా మారింది. దీంతో 2009 ఎన్నికల్లో కూడా మండవ టిడిపి నుంచి గెలిచారు. ఇక తెలంగాణ వచ్చాక ఆయన టిడిపిని వదలలేదు గాని…పోటీ నుంచి తప్పుకున్నారు. 2014, 2018 ఎన్నికల్లో రూరల్ నుంచి బిఆర్‌ఎస్ తరుపున బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గెలిచారు.
అయితే అక్కడ బాజిరెడ్డికి చెక్ పెట్టడానికి మండవని కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ మండవ కాంగ్రెస్ లోకి వస్తే రూరల్ లో బిఆర్‌ఎస్‌కు టఫ్ ఫైట్ తప్పదు. మండవతో కారు పార్టీకి ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ ఉంది.