బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ తన వర్గీయాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి.. సీఎం కేసీఆర్ ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఏప్రిల్ 10వ తేదీన పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన ఏ పార్టీలోకి వెళతారు అనే దానిపై ఆయన అభిమానులతో పాటు రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర విషయంగా మారింది.
ఆయనకు కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఆహ్వానాలు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు పొంగులేటితో బీజేపీ చేరికల కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భేటీకానున్నారు. ఈ భేటీలో పొంగులేటిని బిజెపిలో చేరాలని కోరడంతో పాటు, పార్టీలో చేరితే ఎలాంటి ప్రాధాన్యత లభిస్తుంది అనే విషయంపై కూడా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీ పై తనకు ఎటువంటి సమాచారం లేదని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
తన దగ్గర ఫోన్ లేదని, అందుకే సమాచారం రాలేదని అన్నారు. తనకు చెప్పకపోవడం తప్పేం కాదని.. పార్టీలో ఎవరి పని వారు చేసుకుంటూ వెళతారని స్పష్టం చేశారు. ఇక పొంగులేటి బిజెపిలోకి వస్తే ఆహ్వానిస్తామని.. రాష్ట్రంలోని రాక్షస పాలన పై పోరాడేందుకు ఎవరినైనా కలుపుకొని ముందుకు వెళతామని స్పష్టం చేశారు బండి సంజయ్.