పవన్ కల్యాణ్ జగిత్యాల పర్యటనలో అపశ్రుతి.. ఒకరు మృతి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. పవన్​ను చూసేందుకు కాన్వాయ్​ను ఫాలో అయిన యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

జగిత్యాల వెల్గటూరు మండలం కిషన్‌రావుపేటవద్ద పవన్ కాన్వాయ్​ను ఫాలో అయ్యేందుకు బైకులపై యువకులు వెళ్తున్నారు. పవన్ కల్యాణ్​ను చూసేందుకు వెంబడిస్తున్న ఓ అభిమాని వేగంగా బైకు నడుపుతూ కారును ఢీకొట్టాడు. ఈ క్రమంలో అతడికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తన వారాహి వాహనానికి పూజ చేయించడానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్‌ను చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు కొండగట్టుకు భారీగా తరలివచ్చారు. గజమాలతో ఆయనను సత్కరించారు. అభిమానులకు ఓపెన్‌టాప్‌ వాహనం నుంచి పవన్‌ అభివాదం చేశారు.