తెలంగాణలో ఇవాళ్టి నుంచి 110 నియోజకవర్గాల్లోని రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌లు జరగనున్నాయి. ఆ నియోజకవర్గాల్లోని క్లస్టర్ల నుంచి రైతులను రైతు వేదికలకు ఆహ్వానించి వారి అభిప్రాయాలు తెలియజేసేలా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. అనంతరం వాటిని నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని సూచించారు.
ఈ వానాకాలం సీజన్ నుంచి ప్రారంభించనున్న రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయాలను సేకరించాలని మంత్రి తుమ్మల వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న రైతు బంధు పథకం స్థానంలో ‘రైతు భరోసా’ను అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘రైతు బంధు’ నిబంధనలను మార్చి కొత్త మార్గదర్శకాలతో ‘భరోసా’ను అమలు చేసే దిశగా కసరత్తు షురూ చేసింది.
ఇందులో భాగంగానే రైతులు, వివిధ వర్గాలవారి అభిప్రాయాలను తెలుసుకొని వాటికి అనుగుణంగా రైతుభరోసాపై నిర్ణయం తీసుకోవాలని ఇటీవలి మంత్రిమండలి సమావేశం తీర్మానించింది. ఇందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తోంది. రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, సూచనలను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.