తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపై భారీగా వరద నీరు పేరుకుపోవడంతో సామాన్యులకు, వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. అంతేకాకుండా రోడ్లపై చిరువ్యాపారాలు చేసుకునే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 5 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.
ముఖ్యంగా నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట్, యాదాద్రి, రంగారెడ్డి జల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఇక హైదరాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, గద్వాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, మేడ్చల్, మెదక్, ములుగు, నారాయణ్ పేట్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని, ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది.